Sunday, June 10, 2007

కలకాలం నిలిచే కథల సంపుటి
కొన్ని కథలు ఎంత బాగున్నా చదివినంతసేపే బుర్రలో ఉంటాయ్.ఆ తర్వాత చచ్చినా గుర్తుకు రావు.ఇంకొన్ని కథలు ఒకటికి రెండు సార్లు చదవాల్సి వస్తుంది.కాని అవి కొన్ని ఏళ్ల తర్వాత గూడా సినిమా రీళ్లలా గిర్రున తిరుగుతుంటాయి.దాదాపు నాలుగు దశాబ్దాలుగా పాఠకులకు నిశాపతి గా పరిచయమైన ఎం.హెచ్.వి.సుబ్బారావు వృత్తిరీత్యా ఇంజినీరే అయినా ప్రవృత్తి రీత్యా చక్కటి కథకులు.కవితాత్మకమైన శైలి,హాస్యం,సరసం,వ్యంగ్యం,సెంటిమెంట్,ఆర్ద్రత,భావుకత ఈకథల్లోంచి తొంగిచూస్తుంటాయి.అందుకే కాబోలు రాజుల కాలం నాడు నిర్మించినా చెక్కుచెదరని కోటబురుజుల్లా పటిష్టంగా, పదిలంగా నిలిచే కథలు అనేకం తనఖాతాలో జమ చేసుకోగలిగారు.మానవసంబంధాలు,బంధుత్వాలు,ప్రేమ,అనురాగం,ఆప్యాయత,మమతానుబంధాలనే ప్లాట్లుగా చేసుకుని చిక్కటి కథనాన్ని చక్కటి వాక్యాల్లో అల్లి,ఆరోగ్యకరమైన హాస్యాన్ని,బిగువైన లాజిక్కును,వస్తువైవిధ్యాన్ని దానికి జతచేసిరెండు మూడు తరాల పాఠకుల్ని తన అభిమానులుగా చేసుకున్నారీ ఇంజినీరు.కాంతికిరణం ఆయన మూడో సంపుటం.ఇందులో ఇరవై కథలున్నాయి...వీటన్నింటిలో అతృతగా,ఆబగా చదివించే గుణం వుంది.ఈ సంపుటానికి మకుటంగా ఎన్నుకున్న కథ ' కాంతికిరణం ' నిజంగానే మకుటాయమానమైనదైతే , ' నేతిగిన్నె ' కథల నిండా కమ్మదనాన్ని గిన్నెతో దిమ్మరించింది.' గోపాలబాలా నిన్నే కోరీ... ' హాస్యాన్నినింపింది.' పూచికముల్లు ' చేపముల్లులా గొంతులో ఇరుక్కుపోయి కూచుంది.' గోలీసో డా ' సరదాగా సాగుతూనే సెంటిమెంట్ తో చంపేస్తుంది.' హీనజన్మ ' పశుపక్ష్యాదుల కన్నామనమెంత హీనంగా బతకాలనుకుంటున్నామో,బతుకుతున్నామో,పావురాల రెక్కలతో చాటి చెబుతుంది. ' ఈపాపం ఎవరిది ' రైతుల జీవితాలతో ప్రకృతి,ప్రభుత్వాలు ఆడుకుంటున్న తీరును గుర్తుచేసి చురుక్కుమని గుచ్చుతుంది.' బోర్డింగ్ పాస్ ' కోరికలు పురివిప్పుకునేలా చేస్తుంది.ఇంకా వీటిని గురించి చెప్పడం వృథా ప్రయాస.అయినా చెప్పక తప్పని విషయమేమంటే అది మునిపల్లె రాజు ముందుమాట.అదే వీటిని ఆత్మీయంగా,ఆప్యాయంగా చదివేలా చేస్తుంది.ఈ కథల కాంతికిరణంతో మనసు నింపుకోడానికి ఇంకెందుకాలస్యం? [Review By Sri D.V.R. in' Navya 'weekly Dt 23-5-07.]

0 Comments:

Post a Comment

<< Home